Saturday 5 October 2019

సముద్రము - నీళ్ళ అనుభవం

సముద్రము నీళ్ళఅనుభవం

మొదటి సారి సముద్రపు నీళ్ళు 
నా పాదాలను నన్ను ముద్దాడాయి!

అలుపనేది లేకుండా...
అలసటనేది రాకుండా...
ఎండలు సైతం మరిపించింది!
నురగ నురగగా...
నా దేహానికి అంటుకొని మెరిసాయి!
నన్నూ మెరిసేలా చేశాయి!
పీకల్లోతులో ఆడుకునేలా... 
నా మనసును లాగేసింది!

వదలి రాలేక వదులుకోలేక
సముద్రపు కౌగిలిలో...
అలల జోలలలో...
ఆదమరిచి ఆనందములో తేలిపోయా!

గిర్రున రెండు రోజులు గడిసాయి!
అంతంతమాత్రమున్న నా ముఖం
శ్రీ కృష్ణుని రంగును పులుముకొని
చేపల పోలుసులా... ఊడిపోతోంది! 

రంగుదేముంది? పౌడర్ రాయొచ్చు!
దేహపు చర్మం పొలుసులుగా రాలితే...
మనం కొత్త షర్టు మార్చుకున్నట్టు
సహజసిద్ధంగా రూపం మార్చుకుంటుంది!

కానీ....

సముద్రపు ఒడిలో ఆడుకోవాలని
నాకు ఊహ తెలిసినప్పటి కల!
తీరం పై నా అడుగులు చూసుకోవాలని
నిదురలో వచ్చే తీయని జ్ఞాపకం!

ఎండ్రకాయలతో ఆడుకోవడం
గవ్వలను ఏరుకొని దాచుకోవడం
నాకు ఏటిలోని అనుభవం!
సముద్రము కూడా తీర్చింది ఆ కోరిక!

మనసారా సముద్రాన్ని ఆస్వాదించా... 
నా మనసులోకి ఆహ్వానించా...
ఇక తను బయటికి పోలేదు
నన్ను తాకుతూ నా హృదయంలో 
ఉండిపోవాల్సిందే.. స్థిరపడిపోవాల్సిందే!!

- కుంచె శ్రీ
ఎద్దులపల్లి
9908830477

Wednesday 30 November 2016

నా...నెచ్చెలి!


నీ...చిరునవ్వు కోసం
ఎదురుచూస్తున్నా...
నే...పెదవినై!

నీ...ఊసు కోసం
ఎదురుచూస్తున్నా...
నే...ఊహనై!

నీ...స్వప్నం కోసం
ఎదురుచూస్తున్నా...
నే..నిదురనై!

నీ...కోసమై వస్తున్నా
నే..నీ..నీడనై

నీ...ప్రేమను పంచుతావని
వేకువకోసం ఎదురుచూస్తున్న
ఉదయకిరణంలా నే...నీకోసం
ఎదురుచూస్తున్నా...

            -చింతా.లక్ష్మీనారాయణ(2004)

నీ...కోసం!




మనసుని కాదని చెప్పే
మౌనం ఏదైనా ఉందా..?
ప్రేమని లేదని చెప్పే
మనసు ఏదైనా ఉందా..?

కన్నీళ్ళు పొంగించే బాధేదైనా...
సంతోషంగా స్వీకరించనా నీకోసం!
లో..లో... పొంగే ప్రేమైనా...
దాచేయనా నీ..ఆనందం కోసం!

ఇన్నాళ్ళూ నువ్వూ నేనూ ఒకటనుకున్నా
ఈ క్షణంమే నే..ఒంటరైపోతున్నా
కొన్నాళ్ళ నీ..తోడు నా..సొంతమనుకున్నా
ఈ సమయం నీ..నీడే అందకపోతున్నా.......

       -చింతాలక్ష్మీనారాయణ(2008).

Wednesday 26 October 2016

#ప్రకృతివిదవయ్యె#


ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
సంస్కృతి
సంప్రదాయం
కట్టుబాట్లు
ఆచారాలలవాట్లు!

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
బాష మారే
వేషం మారే
తిండి మారే
శ్రమ మారే
ప్రేమాప్యాయతలు మారే !

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
ఎక్కడ కట్టెలపొయ్యి
ఎక్కడ రాగిముద్ద
ఎక్కడ మంచెంబు
ఎక్కడ కోరమీసం
ఎక్కడ పంచకట్టు!

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
కొండలు చదునయ్యె
మైదానం తూ ట్లమయం
గుడిసెలు పోయె
పచ్చని చెట్లు మోడువారె
ప్రకృతి విదవయ్యె
చెలిమిలో నీరు ఇంకిపాయె
ఏరులు కనుమరుగాయె!!

        - కుంచె చింతాలక్ష్మీనారాయణ.
                        9908830477.
                     

Wednesday 27 April 2016

ఆశ్చర్యపోతున్నావెందుకు??

సూర్యుడు తూ రుపునే
ఉదయిస్తున్నాడని ఆశ్చర్యపోయావా?
అమవాస్యన చీకటి
పున్నమున వెలుగెందుకొస్తుందని ఆశ్చర్యపోయావా?
చంటోడు టీలమ్ముతున్నాడు
వెట్టిచాకిరిచేస్తున్నాడని ఆశ్చర్యపోయావా?
ముసలోల్లు ఎందుకు
అడుక్కుంటున్నారని ఆశ్చర్యపోయావా?
ఋతువులు ఒకదాని తరువాత ఒకటి
వస్తున్నాయని ఆశ్చర్యపోయావా?
సకాలంలో వాటి పని అవి
చేశాయా లేదా అని ఆశ్చర్యపోయావా?
పాలిచ్చిన ఆవులు
కటికోని సంతకెందుకెలుతున్నాయని ఆశ్చర్యపోయావా?
చెట్టెందుకు ఆకరాల్చి
మోడుబారిపోతుందని  ఆశ్చర్యపోయావా?
ఎండలు ఎందుకు
ముదిరిపోయాయని ఆశ్చర్యపోయావా?
మరి ఈ దినమెందుకు
రోడ్లపై ఆమ్లెట్లేసి ఆశ్చర్యపోతున్నావెందుకు??
ఒక మొక్కైనా నాటావా??
నీరైనా పోసావా??
దాని పండైనా తిని ఆశ్చర్యపోయావా??

 ---------------------#కుంచె#

Monday 25 April 2016

#కొత్తదనం#


మోడుబారి తొడిగిన చిగురులో
నిన్ను చూసుకోవడం

గడ్డిపోచపైన మంచు బిందువులో
నీరూపు గీసుకోవడం

నీలాలగగనంలో శ్వేతవర్ణముతో
పిచ్చిగీతలు గీచేస్తుంటాను

తీరంలో మనం వేసిన అడుగుల
గుర్తులు వెతుక్కోవడం
చెరిపిన అలలను చూడకుండా...
 
మళ్లీ మళ్లీ అదే దారిలో
తేనెటీగలా నడుస్తూపోతున్నా...

పదే పదే తడుముతున్నా
గులాబీ రేకుల నునుపు
నీ మోముపై విరభూసిందని

నాలో నువ్వు అనునిత్యం
ఏదో ఓ అనుభూతి కోసం
వెతుకుతుంటావ్

నీలో నేను కలసిపోయి
నీలా ఆలోచిస్తూ
నీజతగా నడుస్తున్నా
నీలో నాలో కోత్తదనం
పరిమళించాలని!!

                    #KuNcHe#